జూన్‌ మొదటి వారం నుంచి సినిమా చిత్రీకరణలు షూటింగ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన సినిమా షూటింగ్స్‌కు, నిర్మాణానంతర కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టాలీవుడ్‌ సినీ ప్రముఖులు కలిశారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధర్వంలో చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్‌, ఎస్.ఎస్‌. రాజమౌళి, దిల్‌రాజు, త్రివిక్రమ్‌, ఎన్‌. శంకర్‌, రాధాకృష్ణ, సి. కల్యాణ్‌, సురేశ్‌బాబు, కొరటాల శివ, జెమిని కిరణ్‌, మెహర్‌ రమేశ్‌, ప్రవీణ్‌బాబు తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. అదే విధంగా సినీ పరిశ్రమలోని కార్మికుల కోసం చేపట్టిన సహాయక చర్యలను వివరించారు. షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరగా, జూన్ మొదటివారం నుంచి చిత్రీకరణలు ప్రారంభించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుందని కేసీఆర్‌ తెలిపారు. అయితే, ప్రభుత్వం.. కొవిడ్‌-19 మార్గదర్శకాలకు అనుగుణంగా సినిమా చిత్రీకరణలు జరపాలని సినీ పరిశ్రమ పెద్దలకు సూచించారు. చిత్రీకరణల అనుమతి, థియేటర్ల పునఃప్రారంభంపై విధి విధానాలను ప్రభుత్వం ప్రకటిస్తుందని అందుకు అనుగుణంగా నడుచుకోవాలని కేసీఆర్‌ పేర్కొన్నారు.